Dada in a match with Kolkata Knight Riders
Thursday, May 19, 2011
Tuesday, May 10, 2011
Happy to Dada again..

Sunday, May 1, 2011
Can old city get its old splendor?

పాతబస్తీ ఎప్పుడు పేలుతుందో తెలియని బాంబు. ఆధిపత్యపోరాటం, రాజకీయ అస్థిత్వంకోసం ఆరాటం, భూవివాదాలూ, వెరసి పాతబస్తీ రాజకీయం. ఏప్రిల్ 30వతేదీ MIM, MBT నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకు సుదీర్ఘమైన, సంక్లిష్టమైన నేపథ్యం ఉంది. ఒవైసీ కుటుంబానికి పాతబస్తీలో ఎంత ఆదరణ ఉందో.. అంతకన్నా ఎక్కువ విద్వేషమూ.. ఉంది. దశాబ్దాలుగా ఇది రగులుతూనే ఉంది. పాతబస్తీపై పట్టుబిగించి సర్వం తామే అన్నట్టు ఆధిక్యం ప్రదర్శిస్తున్న MIM నాయకుల ప్రాబల్యం ఉంది. ఒవైసీ కుటుంబంతో విభేదించి MIM నుంచి వైదొలిగిన అమానుల్లాఖాన్ 1994లో MBT నెలకొల్పారు. దీని నుంచే MIM ఎక్కువ ప్రతిఘటన ఎదురవుతోంది. పాతబస్తీ వెనుకబాటులో.. రాజకీయ పార్టీల ముసుగులో వర్థిల్లుతున్న నేరస్థ ముఠాల ప్రభావం ఉంది. MIMతో పొత్తు పెట్టుకొని పాతబస్తీలో ప్రభుత్వం యంత్రాగం పనిచేయలేని స్థితి (చట్టపాలన) కల్పించిన కాంగ్రెస్, టీడీపీల వైఫల్యమూ ఉంది. లాలూచీ ఉంది. కొన్నేళ్ళ కిందట సలావుద్దీన్ ఒవైసీ (MIM), ఆలె నరేంద్ర (అప్పుడు BJP) మధ్య ఆధిపత్యపోరు సాగినప్పుడు పాతబస్తీ ప్రజలు ఉంటే ఒవైసీ శిబిరంలో ఉండాలి... లేకపోతే ఆలె నరేంద్ర వైపుండాలి. ఇప్పుడు నరేంద్ర స్థానంలో MBT ఉంది. ఒవైసీతో పడనివారూ, MIMలో ఇమడలేనివారూ MBT గూటిలో చేరిపోతున్నారు. అన్ని పార్టీలలాగానే పాతబస్తీలో ప్రాబల్యం కలిగిన పార్టీలు కూడా భూకబ్జాదార్లకూ, అక్రమార్కులకూ, గూండాలకూ కొమ్ముకాస్తున్నాయి. ఇక్కడ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమవటంతో ఎవరి ప్రైవేటు సైన్యం వారికుంది. ఇంతకన్నా దారుణంగా ఉన్న బీహార్‌లో పరిస్థితి మారింది కానీ హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం మారలేదు. మార్చడానికి ప్రయత్నమూ జరగలేదు. CPM సాహసించి చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ఒవైసీ సోదరులు విద్యావంతులు. మంచి వాగ్ధాటి కలిగినవారు. తెలివితేటలు కలిగినవారు. సమయస్ఫూర్తి గలవారు. చట్టసభలలో ప్రతిభావంతమైన పాత్ర పోషిస్తున్నవారు. విదేశాలలో చదువుకున్న ఈ బ్రదర్స్. విదేశాలను సందర్శించి అక్కడి మత వ్యవస్థలనూ, పరిపాలనావ్యవస్థలనూ అధ్యయనం చేశారు. తమ అనుభవాన్నీ, పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించి పాతబస్తీలో ప్రజల జీవనాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి ప్రయత్నించి ఉండే చాలా బాగుండేది. ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పిన ఒవైసీ కుటుంబం అక్షరాస్యతను పెంపొందించడానికి ఉద్యమస్ఫూర్తితో కృషి చేసి ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించగలిగేవారు. పాతబస్తీ లిటరసీ రేటు అమాంతంగా పెరిగి.. ప్రజలు ఏది మంచో.. ఏది చెడో తెలుసుకోగలిగే స్థితిలో ఉండేవారు. ఆసుపత్రిని స్థాపించినట్టే ప్రజావైద్యం పట్ల శ్రద్ధ వహిస్తే బాగుండేది. పాతబస్తీలో సమూలమైన మార్పులు సాధించడానికి అవసరమైన వనరులు, ప్రాబల్యం, అధికారం, సామర్థ్యం, శక్తీ ఉండి కూడా పాతతరం రాజకీయ పద్ధతులనే అనుసరించడం హాస్యాస్పదం (తెలివిగా చేసిందే). నిజానికి నేటి పరిస్థితికి కారణం కూడా ఈ వైఖరే.
పాతబస్తీలో ఇలాంటి పరిస్థితిని మార్చడానికి పెద్ద ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. అదీ ఒవైసీ సోదరుల సాయంతోనే.. లేకపోతే ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ బ్రదర్స్ ఉదారంగా, ప్రజాస్వామికంగా, ప్రగతిశీలకంగా, అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయే విధంగా వ్యవహరించగలిగితే పాతబస్తీలో వాతావరణం కచ్చితంగా మారుతుంది. అనారోగ్యాన్నీ, నిరుద్యోగాన్నీ, నిరక్షరాస్యతను పారదోలడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. పాతబస్తీ కుటుంబాలలో వెలుగు నింపడానికి దోహదం చేస్తుంది. పాతబస్తీ ప్రజల బాగోగులతో నిమిత్తం లేనట్టు ప్రభుత్వం వ్యవహరించడం చేతకాని తనమని నిరూపించబడుతున్నా... ఇది క్షమించరాని నేరం. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పాతబస్తీలో జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. పాతబస్తీ మినహా నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో జనాల్లాగా... ఇక్కడి వారు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తే చాలు. విద్యావకాశాలూ, ఉద్యోగవకాశాలూ, ఆదాయాలూ పెరిగితే క్రమంగా Criminal instinct తగ్గుతుంది. రాగద్వేషాలు, కోపతాపాలు, కక్ష్యలు-కార్పణ్యాలు సమసిపోతాయి. శాంతిసౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి. ఇది సాధ్యమైన మార్పే.
ప్రజల సమస్యలపై స్పందించే (తనకు అవసరం అనుకుంటేనే) తత్వమున్న అక్బరుద్దీన్, ఓ మంచి వక్తగా.. నాయకుడిగా పాతబస్తీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. అలాంటి అక్బర్ కోలుకుంటేనే MIM పార్టీకి కొండంత అండ. దూకుడైన ఉపన్యాసాలతో రెచ్చగొట్టే అసదుద్దీన్ తమ్ముడిపై దాడి ఘటన తర్వాతైనా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇకనైనా ఇలాంటి వివాదాలను పక్కనపెట్టి ఇద్దరు సోదరులు ప్రజాశ్రేయస్సుపై దృష్టిసారిస్తే ఘనమైన చరిత్ర ఉన్న పాతబస్తీ మళ్లీ పాతవెలుగులు సంతరించుకుంటుంది.
జైహింద్
(కొందరు మేధావులు మాట్లాడుతుండగా విని... నా అనుభవాలను జోడించి రాశాను... ఏమైనా మార్పులు అవసరమైతే suggest చేయగలరు)